మారని ఈ లోకం… by Sujatha Surepally

రక్తం అవిరౌతున్న క్షణం
నరాలు పగులుతున్న నిశ్శబ్దం
ప్రాణాలు శకలాలై ఎగిసిపడిన ఘడియ

నీ మాటలో మాయమైన మునుపటి నమ్మకం
నీ పాటలో కానరాని నిన్నటి ధైర్యం
కవితలు రాతలు నిర్వీర్యమైన వైనం
రాబందుల్లాంటి సహజీవన రాజకీయాలతో విలీనమై
వెక్కిరిస్తున్న నీ వినూత్న శూన్యమైన బ్రతుకు

ఆవేశాలు ఆశలు
మొలకెత్తకుండానే చిధ్రమౌతున్న తీరు
కత్తుల వంతెనపై నడుస్తున్నా
పొలీసు పహారాలో నినదిస్తున్నా
మారని ఈ లోకం
ఎవరి కోసం ఎందుకోసం

పుట్టలకొద్ది భగత్సింగులు పుట్టుకొస్తున్నా
జంగు చేస్తున్నా
నా జాతి విముక్తి ఎన్నడో
నా తల్లి కన్నీళ్ళు ఎండేది ఎపుడో
నా రైతన్న, నేతన్న మరణాలు ఆగేదెప్పుడో
మండుతున్న విద్యార్థి గుండె చాల్లారేదెప్పుడో

చావంటే భయం లేదు
బతుకంటే ఆశ లేదు
పోరాటం తప్ప మార్గం లేదు
మట్టి కోసం చారిత్రక జ్ఞప్తి కోసం
ఎదుటి మనిషిలో ఒక చిన్న చిరునవ్వు కోసం
ఎన్నినాళ్ళైనా ఈ యుద్ధం అనివార్యం

సుజాత సూరేపల్లి

You might be interested in :