Questionnaire to SA Leaders and Telangana Opponents – by Syed AbdulMuqtadir

ఈ ఆరు పదుల సమైక్య రాష్ట్రంలో దగాకోరుల, అవినీతుల రాజ్యంలో
త్రిలింగ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన దగుల్బాజి నాయకులతో
నమ్మించి బుకాయించి రాష్ట్రాన్నే కబళించిన దగాకోరులతో
రాష్ట్ర, దేశ పాలకుల నడుగుతున్నాను ప్రశ్నలెన్నెన్నో
మాకాశలెన్నో చూపించినా, మీ అత్యాశె విశాలాంధ్ర కాదా?
కాకలు తీసిన సీమాంధ్ర నాయకుల కుట్రే విశాలాంధ్ర కాదా?
మా నీళ్ళను మళ్ళించి, మాకు బీళ్ళను మిగిల్చి మా నోళ్ళు కొట్టింది మీరు కాదా?
పరసీమ సస్యశ్యామలం తెలంగాణ బీళ్ళమయం ఇది మీ కౄరత్వం కాదా?
నల్లగొండకు ఫ్లురైడు, కూకట్ పల్లికి ఫిల్టర్డ్ నీళ్ళ సప్లయి ఈ పాపం మీది కాదా? 
మా బొగ్గు గనులు దోచి మీ బొక్కసం నింపుకున్నది మీరు కాదా?
మందుల్లాంటి మౌలిక సదుపాయాలు లేక మా కుసుమాలు రాలుతుంటె
కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు కట్టుకున్నది మీరు కాదా?
మా వనరులతో మీ ప్రాంతం దేదీప్యమానం
మాకు మాత్రం గ్యాసు నూనె గుడ్డి వెలుతురు
ఈ కుటిలత్వం, నిరంకుశత్వం, కౄరత్వం, ఎవరిదీ పాపం? మీది కాదా? 
లక్షల కోట్ల విలువయిన మా భూములమ్ముకుని, సొమ్మంతా దోచుకునీ
నిల్వ నీడ లెకజేసి, ఆటోలు, రిక్షాలు మా మొఖాన కొట్టింది మీరు కాదా?
వక్రమార్గాన అస్మదీయులకు ఉద్యోగాలిచ్చి, మా యువతకు నిరాశా నిస్పృహలిచ్చింది మీరు కాదా?
‘హక్కు’ల మాటెత్తిన ప్రతి ఒక్కడినీ ‘అతివాదిగా’ చిత్రించి చంపించింది మీరు కాదా?
పక్కా పథకంతో యువతను పెడత్రోవ పెట్టి ప్రాంతమంతా గగ్గోలు పరిచింది మీరు కాదా?
పల్లెల్లొ బడుల్లేక ఉపనయనపు వయసులో ‘ఉర్రి’ ఉర్రీ’ అనుకుంట మా పిల్లలు గొర్రెలు మేకలు కాసుకుంటె
పట్టణాల్లొ బడుల్లేక మా పిల్లలు హోటలల్ల పనిజేస్తరు, కూలి నాలి చేసుకుంటరు… మరి మీరో?
పుంఖాను పుంఖాలుగా విద్యామందిరాలు, కొద్దో గొప్పో చదువులు, సంకల బ్యాగు హైదరాబాదుకు వలసలు
మా అర్హతకే అర్హతలేనట్టు చూపి, వలసొచ్చినోనికి పనివ్వడమే ధర్మమని చాటి చెప్పింది మీరు కాదా? 
గొర్రెల మందల్లా ఆంధ్రులను వలస తెచ్చి మా జిల్లాల్లో నింపడం కుట్ర కాదా?
ప్రతి తెల్ల చొక్కా జాబును ఆంధ్రోనికిచ్చిన ఘనత మీది కాదా?
మాకు బహిర్భూమికి, పీనుగులకూ జాగ లేకున్నా, బహిరంగంగా
మీ వాళ్ళకు వందల ఎకరాలు పున్యానికి రాసిచ్చిన బకాసురులు మీరు కాదా?
కమిటీల పై కమిటీలు పెట్టి, మా పై వికటాట్టహాసం చేసింది మీరు కాద?
విలీన ఒప్పందాన్ని కాలరాసి మాకు స్వపరిపాలన లేకుండా చేసింది మీరు కాదా?
ప్రతిదాంట్లో చులకన చేసి, జీవితం దుర్భరం చెసింది మీరు కాదా?
తెలుగు వాళ్ళం, అన్నదమ్ములమని అక్కున జేరి దోచుకున్నది మీరు కాదా?
మా సంస్కృతినీ, భాషనూ, జీవనశైలినీ ప్రతినిత్యం కించపరిచింది మీరు కాదా?
అగ్గువకు వ్యవసాయ భూమి, అమ్మినోనికి నాలుగు కొత్తలు … మరి రియల్తో కుమ్మక్కై,
నివాస భూమిగ కన్వర్టులు, కబ్జాలు, ప్లాట్లు, కోట్లు అందుకు సరిగా వలసలు
రియల్ దందాతొ రాజీ పడి, రైతును రోడ్డుకీడ్చిన ఈ పాపం మీది కాదా?
రిజర్వేషన్ల అమలు ఆంధ్రలొ ఆది నుంచి, తెలంగాణాలో 76 నుంచి, ఇది మీ కుటిల రాజనీతి కాదా?
మౌలిక సదుపాయాల్లో, జన్మతః హైదరాబాదీకి, వలస వచ్చీనోనికి ఉన్న తేడా మీ వికృత బుద్ధికి నిదర్శనం కాదా?
ఏమని అడగను? ఇంకేమేమనీ అడగనూ? ఓ నాయకులారా ఇంకెన్నాళ్ళు ప్రశ్నించనూ?
తెలంగాణ ద్రోహులార! ఇంకెణ్ణాళ్ళిలా ఉపేక్షించను? ఎందుకు నేనుపేక్షించను? 
మీ అరాచకాలు ఎన్నని వర్ణించనూ? మీ పాపాలు ఇంకెన్ని లెక్కించనూ
తగదు తగదు తగదూ, 4 కోట్ల ఆర్తనాదాలపై కాలయాపన తగదు
కమిటీలతో సమాధానం రాదు గాక రాదు, ఈ సమస్యకు వేరు పరిష్కారం లేదు 
స్వరాష్ట్రము మా జన్మ హక్కు అంతకు తక్కువ మాకేమి మింగుడు పడదు
ఈ ఆరు పదుల సమైక్య రాష్ట్రంలో దగాకోరుల, అవినీతుల రాజ్యంలో
త్రిలింగ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన దగుల్బాజి నాయకులతో
నమ్మించి బుకాయించి రాష్ట్రాన్నే కబళించిన దగాకోరులతో
రాష్ట్ర, దేశ పాలకుల నడిగాను కొన్ని చిఱు ప్రశ్నలు
ఇది 4 కోట్ల తెలంగాణీయుల ప్రశ్ణావళిలోని విసుమంత భాగం
అడగాల్సి ఉన్నవి ఎన్నో ఉన్నాయి ఇంకెన్నెన్నో ఉన్నాయి
ఓపిక ఉంటె చెప్పు మొదలు పెడతాను ఆంధ్ర భేతాళుని కథ…

You might be interested in :