తెలంగాణ ఉప ఎన్నికల కోసమే చంద్రబాబు బాబ్లీ యాత్ర?

తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకులతో కలిసి బాబ్లీ బస్సు యాత్ర చేపట్టినట్లు భావిస్తున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇదే ఆరోపణ చేశారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారానికి మరో అంశం లేకపోవడం వల్ల, నేరుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎదురయ్యే పరిణామాలపై అనుమానాలు తలెత్తడం వల్ల బాబ్లీ బస్సు యాత్రను చంద్రబాబు చేపట్టారని అంటున్నారు. బస్సు యాత్ర సాగే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

బాబ్లీ ప్రాజెక్టును ఆపించకపోతే తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు అందక ఈ ప్రాంతంలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పదలుచుకున్నారు. అలా జరగకుండా తాము బాబ్లీని ఆపించేందుకు పోరాటం చేస్తున్నామని, కాంగ్రెసు ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆయన చాట దలుచుకున్నారు. తద్వారా తెలంగాణ ఓటర్ల మనస్సులను ఆకట్టుకోవాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు చెంతకు మహారాష్ట్ర ప్రభుత్వం రానీయదనే విషయం చంద్రబాబుకు తెలుసు. అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడం ద్వారా ప్రజల సానుభూతి పొందాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

You might be interested in :